బాల్య వివాహాలు వ్యతిరేకించాలి: తానేటి వనిత

 విజయవాడ: మహిళల రక్షణకై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో కొత్త చట్టాలు తెచ్చే యోచనలో ఉన్నారని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సీఎం జగన్ సూచనలతో సైబర్ మిత్ర, బీ సేఫ్ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. మంగళవారమిక్కడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో 'ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్' అనే అవగాహన కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత పాల్గొన్నారు.


బీ సేఫ్ యాప్‌ను ప్రారంభించిన అనంతరం హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ... అర్ధరాత్రి మహిళలు నిర్భయంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్మా గాంధీ అన్నారు.. అయితే  నేటి సమాజంలో ఆ పరిస్థితులు కనబడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దిశ, నిర్భయ లాంటి ఘటనలు నూతన చట్టాలకు సవాలుగా మారాయన్నారు. 181, 100కు డయల్ చేస్తే సహాయం లభిస్తుందన్న అవగాహన ప్రతి ఒక్కరికీ ఉండాలని పేర్కొన్నారు. అదే విధంగా అధునాతన టెక్నాలజీ పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సుచరిత సూచించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'వ్యక్తిగత డేటా గోప్యంగా ఉంచుకోవాలి. భవిష్యత్ తీర్చిదిద్దే వరకు మాత్రమే టెక్నాలజీ వాడుకోవాలి. నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి' అని మహిళలకు సూచించారు.