బీజేపీ పేరాశలకు మహాబ్రేకు.. అమిత'షాకు'
మహారాష్ట్రలో బీజేపీ పరాభవం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితమైంది కాదు. ఇప్పటికిప్పుడే సంభవించిందీ కాదు. మొదటి నుంచీ అధికారమే పరమావధిగా ఎంతకైనా బరితెగిస్తూ వస్తున్న సంఫ్ పరివార్ నాయకత్వానికి భంగపాటు. కాకపోతే మరీ నాటుగా నాటకీయంగా సంభవించింది. మహారాష్ట్రలో గత 35ఏండ్లలో పూర్తికాలం అంటే ఐదేండ్లపాటు అధికారం చేసిన ఘనత తమ దేవేంద్ర ఫడ్నవీస్ దేనని బీజేపీ ఎన్నికలలో అదేపనిగా ప్రచారం చేసుకుంది. అయితే ఆయనే ఎన్నికల తర్వాత చేతులు ఎత్తేసి ఆ పైన వక్రమార్గంలో గద్దెక్కి మూడు రోజుల్లోనే అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. కొద్ది మాసాల కిందటనే పొరుగు రాష్ట్రమైన కర్నాటకలో ఎడ్యూరప్ప ఆదరాబాదరగా అధికారం చేపట్టి నాలుగు రోజుల్లో నగుబాట్లతో ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఈ తరహా అనుభవాల జాబితా పెద్దదే ఉంది గాని పదమూడు రోజులలో పరాభవ భారంతో పరుగెత్తి రాజీనామా చేసిన అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి ఉదంతం వాటికి మకుటాయమానమైంది. ఈ స్వప్రకటిత విలక్షణ పార్టీకి విలువల కన్నా అధికారం కోసం పరుగులు తీయడమే పరిపాటి అని చెప్పడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి.
మహారాష్ట్రలో మహాశాస్తి వాటన్నిటికంటే తీవ్రమైనదీ తీక్షణమైనదీ. అంతర్జాతీయ నేతగా ఆకాశానికెత్తబడిన ప్రధాని మోడీ, అపరచాణక్యుడుగా (కౌటిల్యుడనే పదం మరింత బాగా అతుకుతుంది) కీర్తించబడిన ఆయన ఆప్త అనుచరుడు అధ్యక్షుడు అమిత్ షా ద్వయానికి ఇది మహా శృంగభంగం. గర్వ భంగం కూడా! ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేయగానే అర్ధరాత్రి అమిత్‌షా ఎలా చక్రం తిప్పాడో మీడియాకు కథలు కథలుగా విడుదల చేశారు. ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కనిపించని పాత్రధారులుగా సూత్రధారు లైనారు. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల ఉమ్మడి షో సుప్రీం కోర్టు విచారణ ఉత్తర్వులు వంటివాటి తర్వాత అంతా గప్‌చిప్. చడీచప్పుడు లేకుండా రాజీనామా చేసి పొసగని సమర్థనలతో సర్దు కోవలసిన పరిస్థితి. అందుకే ఇది అమిత షాకు బ్రేకు.
ఉద్భవఠాక్రే ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుంది, కర్నాటకలో కుమారస్వామిలా కూలిపోదా తదితర ప్రశ్నలన్నీ కూడా ఉండొచ్చు. అయితే దేవగౌడకు శరద్‌పవార్‌కు ఎంత తేడా ఉందో ఈ రెండు పరిస్థితుల మధ్య అంత తేడా ఉంది. ప్రధాని పదవి చేపట్టిన దేవగౌడకు లేని వ్యూహకర్త ఇమేజి పవార్ ఎప్పటి నుంచో కాపాడుకుంటున్నారు. నందోరాజా భవిష్యతి అన్నట్టు తర్వాతి సంగతులు తర్వాత. ఈ ప్రభుత్వం ఉంటుందా లేదా అంటే ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఎడ్యూరప్ప భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకం కాదా? ఈ కలయిక అవకాశవాదం కదా అంటే పీడీపీ, బీజేపీ చేతులు కలపడం కంటేనా కాదు కదా! బీజేపీతో కలసి పోటీ చేసిన శివసేన బయిటకు పోవడం తప్పయితే దాన్ని లోపలికి తీసుకుని గౌరవంగా చర్చలు జరపని బీజేపీనేతలదీ తప్పే కదా? పొత్తు ధర్మం పాటించలేదన్నదే విమర్శ అయితే ఏపీలో టీడీపీతో కలసి ఉండీ ప్రత్యేక హోదా విభజన హామీల వంటివాటికి గుండుసున్న చుట్టిన బీజేపీకి ధర్మం ఉన్నట్టా? వాస్తవానికి మధ్యప్రదేశ్ రాజస్థాన్‌లలోనూ మహాతరహా పాచికలు వేసినా కమల్‌నాథ్ అశోక్ గెల్భాట్ వంటివారి ముందు అవి పారలేదని దేశమంతటికీ తెలుసు. అయితే అక్కడా ఇక్కడా కూడా కాంగ్రెస్ భవిష్యత్‌లో ఎలా వ్యవహరిస్తుందనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. మహారాష్ట్రలో ఈ మూడు పార్టీలు ఒక కనీస ఉమ్మడి కార్యక్రమంతో కూటమిగా అధికారం చేపట్టాయి గనక దానికి కట్టుబడి ఉంటేనే ప్రజలు హర్షిస్తారు. దేశాన్ని ఆకర్షించిన రైతుయాత్ర వంటివిగాని సామాజిక న్యాయం కోసం లౌకికతత్వం కోసం జరిగిన పోరాటాలు గాని ప్రజలను ఆలోచింపచేసి బీజేపీ బలానికి గండి పెట్టాయన్నది వాస్తవం. మజ్లిస్, బహుజన విముక్తి అగాధీ వంటి పార్టీలు శక్తికి మించి పోటీలు చేసి ఓట్లు చీలడానికి కారణమై ఉండకపోతే బీజేపీ మరో పాతిక సీట్లు కోల్పోయేది. కొత్త కూటమి ఈ పూర్వ రంగాన్ని గమనంలో ఉంచుకోవాలి తప్ప కేవలం సంఖ్యల కలబోత మాత్రమే కాకూడదు.
ఇక మహారాష్ఠ్ర పరిణామాలు ఆ రాష్ట్రానికే పరిమితం కాదని చెప్పడానికి కారణా లున్నాయి. కాశ్మీర్ 370ని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని లేకుండా చేసి ముక్కలు చేసిన తర్వాత మోడీ ప్రభ ఎక్కడికో వెళ్లిపోయిందన్నారు. కానీ ఆ వెంటనే జరిగిన మహారాష్ట్ర హర్యానా ఎన్నికలలో ఎక్కడా మెజార్టీ తెచ్చుకోలేకపోవడం ఆ ప్రచారాలు అతిశయమేనని తేల్చి చెప్పింది. గతంలోనూ మధ్యప్రదేశ్ రాజస్థాన్ చత్తీష్‌ఘర్‌లను కాంగ్రెస్ గెల్చుకుంది. కర్నాటకలో ఎలాగో మాయోపాయాలతో పాలనచేస్తున్నది. అయోద్య తీర్పు తర్వాత సంఫ్‌ు పరివార్‌కు గొప్ప వూపు వచ్చిందను కుంటున్నప్పుడు వెంట వున్న శివసేన కూడా బయిటకు పోవడం ఎదురు దెబ్బల పరంపరలో కీలకమైంది. శబరిమల తీర్పును ఉపయోగించుకోవాలనుకున్న కేరళలోనూ ఎల్‌డీఎఫ్ ఆధిక్యత నిలుపుకోగా బీజేపీ ఖాతా తెరవలేకపోతున్నది. తాజాగా బెంగాల్‌లో తమ వారే రాజీనామా చేసి ఎంపీలుగా ఎన్నికైన మూడు స్థానాలూ తృణమూల్ గెల్చుకుంది. రేపు కర్నాటకలో ఫిరాయింపుల అనర్హత రాజీనామా వంటి నాటకాల తర్వాత జరిగే పదిహేను స్థానాల ఉప ఎన్నికలలో ఆరైనా గెలవకపోతే పరువు మిగలదు. కాబట్టి మోడీ షాల వ్యూహాలు నల్లేరు మీద బండిలా నడవవు. మొత్తంపైన చూస్తే మహారాష్ట్ర చేజారిన తర్వాత దేశంలోనే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాల సంఖ్య బాగా కుదించుకు పోయింది. దీనికి ఆర్థిక సంక్షోభం నోట్లరద్దు దుష్ఫలితాలు అసహన రాజకీయాలు మతపర మైన వివాదాలు, కార్పొరేట్ పక్షపాతం ప్రభుత్వ రంగ ఫలహారం శ్రామిక వ్యతిరేకత, ఏకపక్ష పోకడలు మిత్రులనే గాక స్వంత పార్టీవారిని కూడా బేఖారత్ చేయ డం వంటి కారణాలు కనిపిస్తూనే ఉన్నాయి. వాస్తవంలో 2019 లోక్‌సభ ఎన్నికల ముందు బాల్‌కోట సర్జికల్ స్ట్రెయిక్స్ వంటివి జరిగి ఉండకపోతే ఉద్వేగాలు పెంచి ఉండకపోతే దేశభక్తి పేరిట కృత్రిమమైన ఉద్విగత తీసుకురాకపోతే ఫలితాలు మరోలా ఉండేవేమో కూడానని పరిశీలకులు ఇప్పుడు అంటున్నారు. ఆ సమయంలో కృత్రిమంగా సృష్టించిన దేశభద్రత కోణం ప్రజలపై ప్రధానంగా ప్రభావం చూపింది. ఫలితంగా లోక్‌సభలో 300కు పైగా స్థానాలతో పెద్ద విజయం సాధించిన మోడీ షా ద్వయానికి ఈ పరిణామం మింగుడు పడనిదే. 2017లో దేశ భూభాగంలో 71శాతం రాష్ట్రాలను పాలిస్తున్న బీజేపీ దాని మిత్ర పక్షాలు 2019 నాటికి నలభై శాతానికి పడిపోయి నట్టు మీడియా లెక్కలు కట్టింది. ఇప్పటికీ ఆ పార్టీ చేతుల్లో 17 ప్రభుత్వాలున్నాయి. కానీ వీటిలో పెద్దవంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, కర్నాటక మాత్రమే. అయోధ్య తీర్పు తర్వాత యూపీగనక నిలబెట్టుకోలేకపోతే బీజేపీ రాజకీయ మనుగడే తలకిందులవుతుంది. వెంటనే జరిగే జార్ఖండ్ ఎన్నికలపైనా ఈ ప్రభావం ఉండొచ్చు.
కాంగ్రెస్ తీవ్రమైన గందరగోళంలో ఉన్నా ప్రాంతీయ పార్టీలు ఆపసోపాలు పడుతున్నా ప్రజలు బీజేపీని మాత్రం అరకొరగా తప్ప ఆదరించడం లేదు. అనేక చోట్ట ఓడిస్తున్నారు కూడా. గుజరాత్‌లోనే అత్తెసరుగా గెలిచిన స్థితి. దక్షిణ భారతంలో కర్నాటక తప్ప మరెక్కడా కాలూనడానికి వీలవని దశ. ఊగిసలాటల రజనీకాంత్ కూడా బీజేపీ ట్రాప్‌లో పడబోనని కుండబద్దలు కొట్టి చెప్పేశారు నటమిత్రుడు కమల్‌హాసన్‌తో కలవడానికి సంకేతాలిస్తున్నారు. శబరిమల తీర్పుపై వాస్తవిక వైఖరి తీసుకోవడం వల్ల పినరాయి విజయన్ ప్రభుత్వం 2021 ఎన్నికల నాటికి మెరుగైన ఫలితాలు అందుకోవచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే గనక బీజేపీతో అస్పష్ట వైఖరి కొనసాగిస్తున్నారు. రాజ్యాంగ ధర్మం పేరిట కేంద్రంతో మాత్రం మంచిగా ఉండటానికే చూస్తున్నారు. వీరు ఎంతగా పాకులాడినా పిల్లిమొగ్గలు వేసినా బీజేపీ మాత్రం నిత్యం దాడి చేస్తూనే ఉంది. ఏపీ తెలంగాణలకు శూన్య హస్తమే విదిలిస్తున్నది.